పిట్ట కథ
కులం , మతం,డబ్బు ,గబ్బు, జబ్బు బల్లమీద కూర్చుని , దమ్ము లాగుతున్నాయి
ప్రేమ , మైత్రి , దయ, కరుణ చెత్త కుప్ప పక్కన గుడిసెలొ కూర్చుని మాట్లాడుకుంటున్నాయి
ప్రేమ : ఏంటి బ్రదర్ మనం స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకున్నా ఛీ తూ అంటారు , వాలేమో పాచి నోటితొ అత్తరువేసుకున్నా నవాబు బాబ్బాబు అంటారు
మైత్రి : అవును అన్న నాకు కూడా బోధపడలేదు . కాని ఒక సారి అలా వెళ్ళినపుడు విన్నా అన్న వాళ్లకి మన లాగ రక్తం లేదంట , ఏదో కొత్త పేరు చెప్పారన్న , (ఏంటబ్బా అని తలగోక్కుంటోంది ) నాలుక మీద ఉంది నోటి బైటికి రావట్లేదు అన్న
పక్కనుండి దయగాడు మొట్టికాయ వేసాడు
మైత్రి : ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది "రోగం " రోగం ఉంది అంట వాళ్లకి
దయ : రోగంమా అంటె ఏంట్రా?
మైత్రి : ఏమో అన్న నాకేం తెలుసు మొన్న సంతకి (సమాజంలోకి ) వెళ్ళినపుడు విన్న వాళ్లకి రోగం ఉందంట అది పడితే పోదంట అని ,
దయ : ఆబ్బ్బా అంత గట్టిదా అది ,మనకెందుకు లేదు తమ్ముడు అది
ప్రేమ : చాల్లెరా నీ ఆశ ,అవి రావడానికి మనకేం దమ్మిడీ ఉందా ఏంటి .
కరుణ : ఓసారి మన స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడుగా వాడిని అడుగుదాం రా
ప్రేమ ,మైత్రి : ఎవర్రా? (కళ్ళెగరేసి చూసారు )
కరుణ : అదేరా మన ధైర్యంగాడు , ఎప్పుడో చిన్నపుడు విడిపోయినాడు ,ఒకసారి కలుదాంరా చూసి చాన్నాళ్లయింది
ప్రేమ : అరె వాడు ఇంకా బతికే ఉన్నాడా , పోయాడనుకున్నారా
నలుగురు నవ్వుకున్నారు
మైత్రి : యాడున్నాడురా వాడు ఇప్పుడు
కరుణ : ఆ ఏటిగట్టు ఉందిగా అల్లదిగో అటువైపు ఉన్నాడు
ప్రేమ : అరేయ్ మనమెలా వెళ్తామ్రా ఆడికి ఆ కులం గాడికంటే డబ్బుగాడు ఉన్నాడు , యేరు దాటిస్తాడు .మనకేం ఉన్నాయ్ నెత్తురు తప్ప
దయ : అరేయ్ ఒక పని చేదాం, ఆ గట్టు దాటే బదులు మన వెనక ఊర్లో "విప్లవం "గాడు చాలా రోజుల నుండి ఒకడే ఉన్నాడు ఎల్లి అడుగుదాం పద
ప్రేమ : ఔన్రోయ్ మర్చేపోయాను పద పద బేగిన పోదాం
ఊర్లో కెళ్ళి ఒక్కొక్కరిని అడుగుతున్నారు నలుగురు అయ్యా మీకు ఇప్లవం అడ్రసు కాని తెలుసా అండి, కొంచం చెప్పండి. ఒకడేమో "ఇప్లవమా ఎప్పుడూ మా తాతల కాలం లొ విన్నాం ఆ పేరు మళ్ళీ మీరొచ్చాకే " ఇంకొకడు "నాకు తెలిసి వాడు ఒక అనాథ ఎక్కడుంటాడు ఎక్కడికి పోతాడో ఎం తెల్వదు బాబు " ఒకడు పరిగెత్తుకుంటూ పోతంటే మైత్రి గాడు వీడు ఏదో తొందరలో ఉన్నాడు ఆడిగితె వెంటనే చెపుతాడు అనుకున్న జబ్బ పట్టుకుని ఆపి "నీకు కాని విప్లవం గాడి ఇల్లు తెలుసేమిట్రా రంగయ్య? " "ఒరేయ్ నా పేరు బెంగయ్య, వాడెవడో వాడి పేరు కూడా వినలేదు, ఒదులొదులు అవతల కులంగారింట్లో ఆళ్ళది ఎత్తాల, లేక పోతే నా మీదేస్తారు "
ఎల్లెళ్ళరా నువ్వు కాక పోతే సొంగయ్య గాడు వాడు కాక పోతే పిచ్చయ్య గాడు. ఇంతలో ఒకడు అరుపు "ఇదిగో అరేయ్, మీకు ఇప్లవం అడ్రసు కావాలిగా అక్కడ కుంటుకుంటూ పోతన్న ముసలాడు ఆడిని అడగండి చెప్తాడు, మా తాత కి బీడీలు కాలచడం నేర్చుకున్న రోజుల నుండి ఆ ముసలోడు మా తాతకి దోస్తు "
ప్రేమ : అవునా ఆయన పేరేంటి
ఊరివాడు : అసలు పేరు న్యాయం, కాని వాడికి చూపు మందగించి ఒకడు గుడ్డి, కుంటుతుంటాడని అరేయ్ కుంటి న్యాయం అంటారు.
మైత్రి : రేయ్ అంత పెద్దాయన్ని పట్టుకుని ఎంటా మాటలు. సర్లే నువ్వెళ్లు
నలుగురు పరుగెత్తుకుంటూ " ఓఓఓ పెద్దాయన ఓ పారి ఆగు"ఎలాగోలా పట్టుకున్నారు.
దయ : పెద్దాయన దండం బాగుండావా?
న్యాయం : ఏదో గడుస్తోంది రెండురోజులకోసారి తింటే ఇంకో రెండు రోజులు కాళ్ళీడ్చుకుంటూ పోతుంట. ఎవరు మీరు ఎం కావాలి
కరుణ : నా పేరు కరుణ, వాడు ప్రేమ, వీడు మైత్రి, ఆ దుబ్బోడు దయ. మాకు విప్లవం గాడి ఇల్లు కావాలి.
న్యాయం :(కొంచం అలొచ్చిస్తు ) విప్లవమా,, ఒహ్హ్ వాడా ఎప్పుడో వాడిని ఆ మతం, డబ్బు గాళ్ళు కలిసి ఊరినుండి తోసేసారుగా. ఊరిపొలిమేరలొ ఓ పెద్ద రావిచెట్టు కనిపిస్తది దాని కింద చిన్న డేరా గుడిసె ఏసుకుని ఉంటాడు. వాడు బైటికొచ్చి చానెళ్లయింది.
ప్రేమ : సరేనయ్య మేమెల్లి కలుస్తాం అంతా సర్దుకున్నాక మళ్ళీ ఇటొస్తాం ఈ వయసులో ఇలా తిరక్కు మాతో పాటే ఉండిపో, ఇదిగో ఈ పది అణాలు, వచ్చి కలుస్తాం, ఉంటా పెద్దాయన.
గుడిసె దెగ్గరికి వచ్చి, పిలిచారు "ఓయ్ విప్లవం గుడిసె ఇదేనా"
లోపలి నుండి ఉలుకు పలుకు లేదు మళ్ళీ కొంచం గట్టిగ అరిచారు. అయినా ఎవరు పలక లేదు. మైత్రి గాడు పోయి తలుపు తట్టబోయాడు ఇంతలో లోపలి నుండి మాటలు "ఆగు ఆగు ఎవరు మీరు ఎం కావాలి? "
ప్రేమ : విప్లవం నువ్వేనా
విప్లవం : అవును
వీళ్ళ కథ మొత్తం చెప్పారు,
విప్లవం : అయితే ఇప్పుడు ఆ కులం, డబ్బు వాళ్లని ఊరినుండి తరిమేయాలి అంటారు
కరుణ : తరిమేస్తే మళ్ళీ వస్తారు.. అలా కాదు కాని వాళ్ళకి ఏదో రోగం ఉందంట అది తీసేస్తే పొగరు, బలం పోతుంది వాళ్లకి. అది తీసేయాలి
విప్లవం : సరే కాని నేను బైటికొచ్చే పరిస్థితి లేదు.
దయ : ఏ?
విప్లవం : ఏ అంటే... ఇంతకు ముందు వేరే ఊర్లోకెళ్ళి ధైర్యం అని మా చుట్టమోళ్ళ ఇంట్లో ఉన్న. మళ్ళీ తిందరగా వచ్చేస్తా అని నా బట్టలన్నీ అక్కడే పెట్టి ఇక్కడికొచ్చా. వచ్చానా సరే, ఇంతలో ఆ కులం డబ్బు జబ్బు వచ్చి నన్ను ఊరినుండి గెంటేశారు, బట్టలు లేక బైటికి పోలేక ఇదిగో ఇలా లోపలే ఉన్నా. మీరెళ్ళి ఆ ధైర్యం ఇంట్లో నా బట్టలు, మీతో పాటు వాడిని కూడా తీసుకురండి, వాడు కూడా ఇక్కడికి రావాలి రావాలి అనుకుంటున్నాడు. వాడి సొంతఊరు ఇదే, వాడి సొంత ఇల్లు కూడా ఇక్కడే ఉంది
ప్రేమ : అవునా , అయ్యో ఆ యేరు దాటలేక మీ దెగ్గరికొచ్చాం.
విప్లవం : ఎం పర్లేదు ఆ ఈతచెట్టు కొమ్మలేస్కుని ఒకరినొకరు చేయి పట్టుని ఎల్లండి ఓ రోజులో దాటేస్తారు
దయ : అంతె అంటావా
విప్లవం : అంతె
మైత్రి : సారి పదండ్రా
ఈతచెట్లు కొమ్మలు భుజానేసుకుని దిగారు యేరు లోకి పోతూ పోతూ ఉన్నారు. సగం రోజు అయింది, మధ్యలో కరుణగాడి చేయి జారింది వాడు కొట్టుకుపోతున్నాడు. వీళ్లు కూడా చాలా వరకు వాడిని పట్టుకోడానికి వెళ్లారు కానీ చేతపట్టలేక పోయారు. ఎలాగైనా సరే ధైర్యంని తీస్కోచి విప్లవంతో కలపాలి అనుకుని మళ్ళీ నిలబడి యేరు దాటుతున్నారు. కాళ్లు చచ్చుపడిపోతున్నాయి, చేతుల్లో బలం పోతోంది అయినా సరే నడిచారు, నడిచారు చివరకి ఒడ్డు చేరుకున్నారు, అక్కడే ధైర్యం ఇల్లు కనపడి లోపలికి వెళ్లారు, కరుణగాడు అక్కడే కూర్చున్నాడు. నమ్మలేక సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్నారు. ఎలా వచ్చావురా ఇక్కడికి పోయావ్ అనుకున్నాం
కరుణ : నేను అలాగే అనుకున్న రా ఇంతలో ఇదిగో అటు పోతున్న "సత్తువు "చేయి పట్టి లాగి వాడి బోటులోకి వేస్కుని తీస్కోచ్చాడు
ప్రేమ : అరేయ్ సత్తువు ఎలా ఉన్నావ్ రా? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా?
సత్తువు : నాకేం తక్కువరా, బాగానే ఉన్నా.
మాటమాటాల్లో ధైర్యం వచ్చాడు. రండిరా తింటూ మాట్లాడుకుందాం. మొత్తం సంగతి విని పదండి ఇప్పుడే వెళదాం మన విప్లవం గాడికి కూడా కలిసి, ఆ రోగం వాళ్ళని తీసేసి మన ఊర్లో మళ్ళీ పాత రోజులను గడుపుదాం.
అంతా సొంతవూరికొచ్చి కలుసుకున్నారు,
ప్రేమ : రేయ్ పెద్దాయన న్యాయం మర్చిపోయాం పదండి తీస్కోధాం.
కులం, మతం, డబ్బు, జబ్బు ఇంటిముందు నిలబడ్డారు ప్రేమ, మైత్రి, దయ, కరుణ, ధైర్యం, విప్లవం, న్యాయం.
ఇన్ని రోజుల అణచివేత, అంటరానితనం, పేదరికం అన్నీ గుర్తుకొచ్చాయి. పెద్దాయన చేతి కర్ర తీస్కుని ధైర్యం, విప్లవం కలిసి ఒకే దెబ్బ కొట్టారు, ఒకే దెబ్బతో కులం, మతం, డబ్బు, జబ్బు లా రోగం వదిలింది.
అదే దెబ్బతొ ఆ కవి ఉలుకున్న నిద్రలేచి, ఇది కలా అనుకుని మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ కలలు కనడానికి
Comments
Post a Comment